శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దివ్య అనుగ్రహం కొరకు సంపూర్ణ పూజా క్రమం మరియు వ్రత కథ
📖 శాశ్వత పూజా విధానం (Official Devotional Content)
🌸 వినాయక చవితి వ్రతకథ
హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా
అవి కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారు. ఆ పార్వతీ తనయుడు అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని
భారతీయుల ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు
ప్రచారంలో ఉన్నాయి. అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాాయక చవితి పండుగను కుల మతా,
జాతలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం.
హిందువుల తొలి పండుగ వినాయక చవితి.
ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే.
నీలాపనిందలు పోగొట్టే వినాయక వ్రతకథ.
భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే వినాయకుడి
జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టిన
రోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని 'వినాయక చవితి' (Ganesh Chaviti ) లేదా వినాయక చతుర్ది (Ganesh
Chaturthi )పండుగగా హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు,
ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే దీనిని హిందువులకు తొలి పండగ అని అంటారు.
వినాయక చవితి ( Vinayaka chavithi Pooja) రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి
ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య
భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి,
దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని
వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం,
గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని
పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.
📖 వినాయక వ్రత కథ (వినాయక ఉద్భవం, గణాధిపత్యం & ఋషిపత్నుల కథ)[క్లిక్ చేసి తెరవండి/మూయండి]
వినాయక ఉద్భవం
వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత
వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.
పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని, పోగొట్టుకుని.. భార్య, సోదరులతో
వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న
సూతమహామునిని దర్శించి.. తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు.
అంతట ఆ సూతమహర్షి.. శకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన
దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగేను.
గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడ్ని మెప్పించి.. తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు.
ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసరుడు అతడు
అజేయుడైనాడు.
తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖితురాలైంది.. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును
తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి.. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట
తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దును ఆడించి గజాసరుడ్ని మెప్పించాడు ఈ ఆనందంలో ‘ఏమి కావాలో కోరుకో’ అని గజాసరుడు
అనగా.. అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు.. నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు.
తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ‘ప్రభూ
శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది.. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు.. నా
చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు.
నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని
స్వస్థానోన్ముఖుడైనాడు.
తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త
రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ
దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి
తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.
గణాధిపత్యం
దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు
అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు.
ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి
శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.
సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి
ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు.. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన
వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు.
దీంతో కుమారస్వామి తన నెమలివాహనంపై రువ్వున ఎగిరిపోగా.. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు.
దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ
కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు.
ఆవిధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి,
మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.
గణేశుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో
సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం
చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు.. గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా
నుజ్జవుతాయి అనేది నానుడి.. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు.
దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి
నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం
చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది.
కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో
అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తఋషులు, వారిని విడిచిపెట్టారు.
శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ
బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు.
మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన
శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు.
అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని
సవరించింది.
ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం
గడిచింది.
💎 శమంతకోపాఖ్యానం (శ్రీకృష్ణుని శమంతకమణి కథ)[క్లిక్ చేసి తెరవండి/మూయండి]
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ!
ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు
వెళ్లిపోయాడు.
ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే
ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు.
దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు.
కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని
ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు
ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు.
తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక
సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు
చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త
విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు.
శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద
పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం
అడుగులు కనిపించాయి.
వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు
రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది.
కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు
యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది.
తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం
చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు.
శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు
శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు.
నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం
జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి
వారికి ఏది గతి?’ అన్నారు.
‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న
వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని
పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట
వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్ యథాస్థాన ముద్వాసయామి
ఈ మంత్రం చెబుతూ ఉద్వాసన చెప్పాలి. వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన
చెప్పొచ్చు.. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి.