శ్రీ లక్ష్మీ గణపతి స్వామి నేపథ్యం
🚩 75 సంవత్సరాల చారిత్రక భక్తి వైభవం • బాలగంగాధర తిలక్ మహాశయుని స్ఫూర్తితో

శ్రీలక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవాలు, వేలివెన్ను గాంధీ బొమ్మ సెంటర్ నందు సుమారుగా స్వాతంత్య్రము వచ్చినప్పటి నుండి బాలగంగాధరతిలక్ మహాశయుని పిలుపు మేరకు వినాయక చవితి సందర్భంగా ప్రతీ సంవత్సరం, నిరాటంకంగా, గొప్పగా నేటి వరకు75 సంవత్సరాలుగా నిర్వహించబడుచున్నవి.స్వామి వారి మూర్తి వెదురుతో తయారై, ప్రతీ సంవత్సరం అందంగా అలంకరించి, వినాయక చవితి రోజున తెల్లవారు జామున గ్రామస్తులు, కమిటీ సభ్యులు, యువకులు అందరూ గోస్తనీనదికి వెళ్ళి స్నానమాచరించి, అలంకృత వినాయక స్వామిని మేళతాళాలతో ఊరేగింపుగా గాంధీ బొమ్మ వద్ద గల పందిట్లోనికి తీసుకుని వచ్చి సింహాసనం పై ఆశీనులను గావింపజేస్తారు.

🕉️ 10 రోజుల నిత్య పూజలు & 11వ రోజు మహా ఉత్సవం

తదుపరి తెల్లవారిన తరువాత కొంతమంది దంపతులచే వినాయక వ్రతం పండితులు చేయిస్తారు. ఆవిధంగా10 రోజులపాటు స్వామివారికి నిత్య అభిషేకాలు, గరిక, పుష్పాలతో పూజలు,దర్శనాలు, నూతన నగదు దండలతో మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది.11వ రోజు మేళతాళాలతో, చిత్ర విచిత్ర వేషధారులతో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమములన్నియు శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి.ప్రస్తుతం ఈ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ శిరిగిన శివ రాధాకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు.

స్వామివారి దివ్య అలంకార విశేషాలు & భక్తుల సమర్పణలు

గత 20 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో స్వామివారి అలంకారాలు రంగు మెరుపు కాగితాల స్థానే పట్టు వస్త్రాలు,జరీ పట్టీలు,మెరుపురాళ్ల పట్టీలు,వెండి,బంగారు,ఇత్తడి ఆభరణాలతో అలంకరింపజేయడం జరుగుతున్నది.

ఈ విధంగా అలంకరణ చేయుటకు చవితికి నెలరోజుల ముందుగా మొదలు పెట్టి చవితి నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతీ సంవత్సరం భక్తులు తమ కోరిక నెరవేరినందుకు స్వామివారికి ఎదో ఒక ఆభరణం తయారు చేయించి చవితిరోజున ధరింపజేస్తారు. స్వామి వారి ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత చినదేవుని గుడి నందు భక్తులచే బహుకరించబడిన మందిరం నందు స్వామి వారి మూర్తిని ఆశీనులను జేస్తారు.అప్పటి నుంచి స్వామివారు నిత్య దీప, ధూప, నైవేద్యాలు, అభిషేకాలు,ఆరాధనలతో సంవత్సరం అంతా భక్తుల పూజలు అందుకుంటూ, వారి కోరికలు తీరుస్తూ కొలువై ఉంటారు.

🙏

ఈ స్వామి వారిని గత 35 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం కొత్త రూపంలో అలంకరించే అదృష్టం కమిటీవారి ద్వారా స్వామివారి ప్రేరణతో కలిగినందులకు సదా నేను కృతజ్ఞుడను.

🌟

శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రత్యేకతలు, మహిమలు

ముఖ్యంగా స్వామి వారు పిల్లలు లేని వారికి సంతానం ఇవ్వడం, వివాహం కాని వారికి వివాహం జరిపించడం, మంచి ఉద్యోగం లో స్థిరపడేటట్లు చేయడం, పిల్లలకు విద్యపై శ్రద్ధ ఉండేటట్లు చేయడం,అన్యోన్య దాంపత్యాన్ని ఇవ్వడం,సంకటాలనుండి రక్షించడం,రైతులకు గిట్టుబాటుగా పంటలు పండేటట్లు చేయడం, వ్యాపారులకు మంచి ఉన్నతిని ప్రసాదించడం,నూతనగృహ నిర్మాణాలు మహిమలుగా చెప్పవచ్చును.

వారి కోరికలు తీరిన తర్వాత వారి మొక్కుని బట్టి కొత్త రూపాయిలతో దండలు గుచ్చి స్వామి మెడలో వేసి ఆనందించడం స్వామి ప్రత్యేకతగా చెప్పవచ్చును. సంతానవతులైనవారు పిల్లల బరువుకు సరిపడే రూపాయి నాణేలు,పటికబెల్లంతో తులాభారం స్వామి సన్నిధిలో వేయడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చును.

స్వామివారి నెల రోజుల అలంకరణ సమయంలోసేవ చేసిన యువకులకు మంచి ఉద్యోగాలు, ఉన్నత చదువులకు మంచి విద్యాసంస్థలలో,విదేశాలలో సీట్లు సంపాదించి, అభివృద్ధి పథంలో ఉన్నారు.అంతెందుకు స్వామివారిని నమ్మిన వారికి కొదువ లేదు.

ఇక సంవత్సరం పొడవునా ,ప్రతీ బుధవారం, విశేష అర్చనలు,అభిషేకాలు జరుగుతున్నవి.విశేషించి ప్రతీ నెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు తెల్లవారుజామునుండి విశేష అభిషేకాలు, పుష్పాలతో, గరికతో,విశేష పూజలు భక్తులు అత్యంత శ్రద్ధతో జరుపుకొంటారు. స్వామివారిని కొలవడంతో తమ సంకటాలు అన్నీ తొలగి ఆనందంగా జీవిస్తున్నామని గ్రామంలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు.

మరి ముఖ్యంగా గ్రామంలో ఎవరింట వివాహం జరిగినా మొదటి శుభలేఖ స్వామివారికే ఇస్తారు.ఆ తర్వాతే బంధువులు, స్నేహితులకు ఇవ్వడం,స్వామివారిని తమ కుటుంబ పెద్దగా భావించడం,వారికి స్వామివారిపై గల అపార అభిమానానికి గుర్తుగా భావించవచ్చును.

🎊 11వ రోజు స్వామివారి దివ్య రథోత్సవం & ఊరేగింపు వైభవం

అలాగే స్వామివారి 11వరోజు ఊరేగింపు ఒక ప్రత్యేకత ను కలిగివుంది.ఈ సంవత్సరం ఏ వాహనంలో స్వామి ఉరేగుతారో అనే ఉత్కంఠ అందరిలో ఉంటూ ఆ ఉరేగింపు కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ప్రతీ సంవత్సరం కొత్తగా ప్రత్యేక ఆకర్షణగా, అధిక వ్యయంతో వ్యయప్రయాసలకోర్చి స్వామివారి రధం తయారు చేయించి,ఊరేగింపు జరిపించడం గొప్ప విషయం.

ఇంత వ్యయప్రయాసలకోర్చి తయారు చేసిన రధం ఈ ఒక్కసారికే ఉపయోగిస్తారు.మారు సంవత్సరం మరొక కొత్తరధం.

ఉరేగింపునాడు గ్రామమంతా ప్రతీ ఇంట్లో పెద్ద శుభకార్యం జరుగుతున్నట్లుగా భావిస్తారు.ప్రతీ ఇల్లు బంధువులు, స్నేహితులతో కళకళలాడుతుంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలలో ఉన్నవారందరూ వస్తారు.

ఇక ఊరేగింపు చిత్ర విచిత్ర వేషాల ట్రాక్టర్లతో,బ్యాండ్ మేళాలు, సన్నాయి,తాషాలు, నేలపై డాన్సులు,బుట్టబొమ్మలు,కోలాటాలు, కర్రసాము,భజన కీర్తనలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున జరిగే కార్యక్రమంలో చిన్న అపశ్రుతి కూడా జరుగదు.దీనికి కారణం లక్ష్మీ గణపతి స్వామి వారి మహిమే అని చెప్పక తప్పదు.ఈ సంవత్సరం మునుపటి వైభవంతో ఊరేగింపు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

స్వామివారి మహిమ మాత్రం అంతకంతకు పెరుగుతోంది.

🔔
మహోత్సవ దివ్య ఊరేగింపు తేదీ

ఈ సారి ఊరేగింపు 24.09.2026 గురువారం.

సర్వ భక్తులు విచ్చేసి స్వామివారి శోభాయాత్రలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

🪔